-->

నాన్న డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ

నాన్న డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ


 నాన్న డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ

కామారెడ్డి జిల్లా: ఆర్టీసీ బస్సులో డ్రైవర్‌ను కండక్టర్‌ సాధారణంగా ‘అన్నా’, ‘తమ్ముడు’ లేదా ‘అంకుల్‌’ అంటూ పిలుస్తుంటారు. కానీ ఓ బస్సులో మాత్రం కండక్టర్‌ ఏకంగా డ్రైవర్‌ను ‘నాన్న’ అని పిలవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

బస్సు ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్‌ “నాన్న.. బస్సు ఆపు” అని చెప్పగానే డ్రైవర్‌ బస్సును నిలిపారు. దీంతో ప్రయాణికులంతా డ్రైవర్‌, కండక్టర్‌ వైపు ఆసక్తిగా చూశారు. అసలు కండక్టర్‌ డ్రైవర్‌ను నాన్న అని ఎందుకు పిలిచాడో తెలుసుకునేందుకు ఓ ప్రయాణికుడు డ్రైవర్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన గుజ్జరి గంగారాం దశాబ్దాలుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు రంజిత్‌కుమార్‌ ఇటీవల ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరారు.

ఈ క్రమంలో సోమవారం బాన్సువాడ డిపో అధికారులు తండ్రీకొడుకులకు ఒకే రూట్‌లో డ్యూటీ కేటాయించారు. నిజామాబాద్‌–బాన్సువాడ రూట్‌లో ఒకే బస్సులో గంగారాం డ్రైవర్‌గా, ఆయన కుమారుడు రంజిత్‌కుమార్‌ కండక్టర్‌గా విధులు నిర్వహించారు.

ఇలా తండ్రి డ్రైవర్‌గా, కొడుకు కండక్టర్‌గా ఒకే బస్సులో విధులు నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. సాధారణంగా ఇంట్లో తండ్రి–కొడుకులుగా ఉండే వారు.. విధి నిర్వహణలో మాత్రం డ్రైవర్‌–కండక్టర్‌గా కలిసి ప్రయాణికులకు సేవలందించడం ఆసక్తికరంగా మారింది.

Blogger ఆధారితం.