రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి
నిజామాబాద్, సెప్టెంబర్ 21: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. అధికారిక పని చేసేందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలోని ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాల్దా అశోక్ (AO-1), ఆడిట్ విభాగంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న కలకుంట్ల కిరణ్ కుమార్ (AO-2) లు ఓ ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు.
ఫిర్యాదుదారుడి తల్లి నెలవారీ పెన్షన్ మంజూరుకు అవసరమైన ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ సిద్ధం చేయడం, సర్వీస్ బుక్‌లో అవసరమైన వివరాలు, ఎంట్రీలు నమోదు చేయడం కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 21న ఉదయం 11.18 గంటల సమయంలో నిజామాబాద్ పట్టణంలోని రాజా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని సీతారాంనగర్ కాలనీలో ఉన్న పద్మశాలి సంఘం వద్ద ఫిర్యాదుదారుడి నుంచి రూ.15,000 లంచం స్వీకరిస్తుండగా నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా తమ విధులను నిజాయితీగా నిర్వహించాల్సిన ఇద్దరూ అక్రమ ప్రయోజనం స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.
ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల విచారణకు సంబంధించిన గౌరవ II అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ ఏసీబీని వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసే వ్యక్తి పేరు, ఇతర వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment