-->

ఉప్పల్‌లో దారుణం.. మైనర్‌పై పలుమార్లు అత్యాచారం

గర్భం దాల్చడంతో అబార్షన్.. నిందితుడికి తల్లి సహకారం


ఉప్పల్‌లో దారుణం.. మైనర్‌పై పలుమార్లు అత్యాచారం గర్భం దాల్చడంతో అబార్షన్.. నిందితుడికి తల్లి సహకారం

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు, ఆమె తల్లి కలిసి గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఉప్పల్‌ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బాలిక తన తల్లితో కలిసి ఉప్పల్‌ ప్రాంతంలో నివసిస్తోంది. బతుకుదెరువు కోసం వారు నగరానికి వలస వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలిక తల్లికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తరచూ వారి ఇంటికి వచ్చేవాడని సమాచారం.

ఈ నేపథ్యంలో బాలికపై నిందితుడి కన్నుపడింది. బాలికను బెదిరించి, మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణానికి బాలిక తల్లి సహకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తల్లి ఇంట్లో ఉన్న సమయంలోనే బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

వరుసగా జరిగిన అఘాయిత్యాల కారణంగా బాలిక గర్భం దాల్చింది. దీంతో నిందితుడు, బాలిక తల్లి ఆమెను మేడిపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి జులైలో గర్భస్రావం చేయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బాలిక బంధువు కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలిక సుమారు ఎనిమిది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది.

ఇటీవల బాలిక ఉప్పల్‌లోనే నివసిస్తున్న తన అక్క ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన విషయాన్ని అక్కకు వివరించి కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. దీంతో అక్క వెంటనే బాలికను తీసుకుని ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం, వైద్య నివేదికలు, ఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.