-->

నిన్న హుషారుగా జెండా పండుగలో పాల్గొన్నారు.. తెల్లారేసరికి ఆఫీస్‌లో విగతజీవిగా

నిన్న హుషారుగా జెండా పండుగలో పాల్గొన్నారు.. తెల్లారేసరికి ఆఫీస్‌లో విగతజీవిగా

నిన్న హుషారుగా జెండా పండుగలో పాల్గొన్నారు.. తెల్లారేసరికి ఆఫీస్‌లో విగతజీవిగా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయన.. ఆదివారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

రాంపూర్‌హాట్‌లోని తన నివాసానికి సమీపంలో ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆశిష్ బెనర్జీ ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఆయనను గమనించి వెంటనే కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహం సమీపంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. తన రాజకీయ జీవితంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎటువంటి తప్పు చేయలేదని అందులో బెనర్జీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, సూసైడ్ నోట్‌తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

ఆశిష్ బెనర్జీ రాంపూర్‌హాట్ నియోజకవర్గంలో టీఎంసీకి కీలక నేతగా కొనసాగారు. 2001 నుంచి 2026 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి సుమారు 25 ఏళ్ల పాటు నియోజకవర్గంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.

అయితే 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రాంపూర్‌హాట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధ్రుబ సాహా చేతిలో ఆశిష్ బెనర్జీ ఓటమి పాలయ్యారు.

ఒకవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని కనిపించిన ఆయన.. మరుసటి రోజే ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793