తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం, నీటి విడుదలపై కలెక్టర్ అంకిత్ పరిశీలన
తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం, నీటి విడుదలపై కలెక్టర్ అంకిత్ పరిశీలన
చర్ల: తాలిపేరు ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అంకిత్ IAS బుధవారం సందర్శించి ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, నీటి విడుదల, గేట్ల నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 73.80 మీటర్లుగా ఉండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లుగా ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
బుధవారం ప్రాజెక్టుకు సుమారు 2,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు ద్వారా సుమారు 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నట్లు వివరించారు.
కంట్రోల్ రూమ్ పరిశీలన
అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాజెక్టు కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల నిర్వహణ, నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే అంశాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సాంకేతిక సహకారం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నీటి వినియోగంలో ప్రణాళిక అవసరం
వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రాజెక్టులోని నీటిమట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అవసరాన్ని బట్టి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని, నీటి వృథాను అరికట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లు, కంట్రోల్ రూమ్, ఇతర యంత్రాంగం నిరంతరం సక్రమంగా పనిచేసేలా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ సూచించారు.
సాగునీరు, తాగునీటి అవసరాలను సమన్వయం చేసుకుంటూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

Post a Comment