-->

భర్తను కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణ హత్య

 

భర్తను కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణ హత్య

భర్తను కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భార్య.. ప్రియుడితో కలిసి దారుణ హత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించిన భార్య.. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు దొంగతనం నాటకం ఆడి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి అసలు విషయాన్ని బయటకు తీశారు.

ఢిల్లీలోని సంగమ్ విహార్‌కు చెందిన మున్నా లాల్ (55) ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య మంజు (45) అలియాస్ నజియా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న మున్నా లాల్‌కు.. ఇంటి సమీపంలో మెకానిక్‌గా పనిచేసే 20 ఏళ్ల చమన్‌తో భార్య నజియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

భర్తను అడ్డుగా భావించిన నజియా.. మున్నా లాల్‌ను హత్య చేస్తే రూ.5 లక్షలు ఇస్తానని, ఆ తర్వాత ఇద్దరం కలిసి జీవించవచ్చని చమన్‌ను ప్రేరేపించినట్లు పోలీసులు వెల్లడించారు.

నిద్రమాత్రలు ఇచ్చి.. కిరాతకంగా హత్య

పక్కా ప్రణాళికతో చమన్ తన సహచరుడు కిషన్ (28)తో కలిసి హత్యకు పథకం రచించాడు. హత్యకు ముందు రోజు రాత్రి నజియాకు నిద్రమాత్రలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటిని నీటిలో కలిపి నజియా తన భర్త మున్నా లాల్‌కు ఇవ్వగా.. వాటిని సేవించిన ఆయన గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

మున్నా లాల్ నిద్రలో ఉన్న సమయంలో చమన్, కిషన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఇద్దరూ కలిసి ఆయన గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. అనంతరం మర్మాంగంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ షాక్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మున్నా లాల్ మరణించాడని నిర్ధారించుకునేందుకు కర్రలతో కూడా కొట్టినట్లు విచారణలో వెల్లడైంది.

ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి బయట రోడ్డుపై పడేసి అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దొంగతనం నాటకం

భర్త హత్యకు గురైన విషయం బయటకు రాకుండా నజియా మరో నాటకానికి తెరలేపింది. ఇంట్లో దొంగలు ప్రవేశించి తన భర్తపై దాడి చేశారని పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చింది. పోలీసులను నమ్మించేందుకు ఇంట్లోని వస్తువులను చెల్లాచెదురుగా పడేసి దొంగతనం జరిగినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

అయితే ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బయటకు వెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నజియాపై అనుమానం పెంచుకుని లోతుగా విచారించారు.

పోలీసుల విచారణలో నజియా చివరకు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆమెతో పాటు ప్రియుడు చమన్, అతని సహచరుడు కిషన్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

కుమారుడు ఇంట్లో లేని సమయంలో హత్య

మున్నా లాల్ కుమారుడు సాధారణంగా ఇంట్లోనే ఉండేవాడని పోలీసులు తెలిపారు. అయితే అతడు కన్వర్ యాత్రకు వెళ్లిన విషయాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. కుమారుడు ఇంట్లో లేని సమయాన్ని ఎంచుకుని హత్యకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. అనంతరం దొంగతనం నాటకంతో పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793