-->

బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’.. 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ మిషన్లు

 

బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’.. 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ మిషన్లు

బీసీ మహిళలకు ‘ఇందిరమ్మ కుట్టు మిషన్లు’.. 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ మిషన్లు

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం’ ప్రారంభించినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి. విజయలక్ష్మి తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.

ఈ పథకానికి అర్హులైన మహిళల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా 2026 సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్హతలు ఇవే..

పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు 18 సంవత్సరాలు నిండి, 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. నిరుద్యోగులు, పేద మహిళలు, నిరాదరణకు గురైన వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది.

దరఖాస్తుదారులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి. కనీస అక్షరాస్యత అవసరం కాగా, 5వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉన్నవారు అర్హులు.

అయితే 2023–24 ఆర్థిక సంవత్సరంలో బీసీ ఆకేషనల్ స్కీమ్/స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక సహాయం పొందిన వారు ఈ పథకానికి అర్హులు కాదని అధికారులు స్పష్టం చేశారు.

ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు సమర్పించాలి

పథకం మంజూరు కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత కులం, ఆదాయం, నివాసం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్హతలు, టైలరింగ్ శిక్షణ లేదా అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు (MPDO), పట్టణ ప్రాంతాలకు చెందిన వారు సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు 2026 సెప్టెంబర్ 13వ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి. విజయలక్ష్మి సూచించారు.

బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని అధికారులు కోరారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793