గచ్చిబౌలిలో కుప్పకూలిన 7 అంతస్తుల నిర్మాణ భవనం
గచ్చిబౌలిలో కుప్పకూలిన 7 అంతస్తుల నిర్మాణ భవనం
హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం మధ్యాహ్నం భారీ శబ్దంతో భవనం కూలిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద సమయంలో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. అంజయ్యనగర్‌లో సుమారు 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం పెద్ద మురుగు కాలువను ఆనుకుని ఉండటంతో పాటు, పక్కనే ఉన్న భవనాలకు ఎలాంటి ఖాళీ లేకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. భవనం కూలిన సమయంలో భారీగా శిథిలాలు చుట్టుపక్కల ఉన్న అపార్ట్‌మెంట్లపై పడటంతో ఆ భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
భవనం శిథిలాలు పక్కనే ఉన్న వైట్‌ఫీల్డ్ అపార్ట్‌మెంట్‌పై పడటంతో నాలుగో అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
భారీ శబ్దంతో పరుగులు తీసిన జనం
ఏడంతస్తుల నిర్మాణ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో భారీ శబ్దం వచ్చింది. దీంతో చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలు, సమీపంలోని హాస్టళ్లలో ఉంటున్న వారు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాద స్థలంలో దుమ్ము, పొగ అలుముకోవడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
రంగంలోకి ఫైర్, పోలీసు సిబ్బంది
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాతే వాటి కింద ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయం స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై ప్రశ్నలు
అంజయ్యనగర్‌లో ఇరుకైన స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాల పక్కన, భవనాల మధ్య తగినంత ఖాళీ లేకుండా నిర్మాణాలు చేపట్టడం ప్రమాదాలకు కారణమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
గచ్చిబౌలి అంజయ్యనగర్‌తో పాటు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లోనూ ఇరుకైన స్థలాల్లో ఐదు, ఆరు, ఏడు అంతస్తుల భవనాలను నిర్మించి వాటిలో హాస్టళ్లను నిర్వహించడం పెరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఇలాంటి నిర్మాణాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారనే విషయంపై సహాయక చర్యలు పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Post a Comment