సింగరేణిలో కేబుల్ కేటుగాళ్లు.. పహారా కాసేవారే పాత్రధారులా?
సింగరేణిలో కేబుల్ కేటుగాళ్లు.. పహారా కాసేవారే పాత్రధారులా?
రామగుండం–పెద్దపల్లి: ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ సింగరేణిలో విలువైన సామగ్రికి భద్రత కరువవుతోందా? ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్-2 గనిలో వరుసగా చోటుచేసుకుంటున్న కాపర్ వైర్, విద్యుత్ కేబుళ్ల చోరీలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే పలు దొంగతనాలు జరగడం కార్మికులు, అధికార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.
వారం రోజుల్లోనే నాలుగు చోరీలు?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గడిచిన వారంలో ఓపెన్‌కాస్ట్-2 గనిలో ఏకంగా నాలుగు చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న గనిలో సుమారు 120 మీటర్ల కాపర్ వైర్ చోరీకి గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతుండగానే రెండు, మూడు రోజుల వ్యవధిలో స్పైడర్ మిషన్‌కు విద్యుత్ సరఫరా చేసే మరో 50 మీటర్ల విద్యుత్ వైర్ అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.
వరుస చోరీలతో అప్రమత్తమైన అధికారులు అంతర్గత తనిఖీలు చేపట్టగా, ఈ నెల 16న సుమారు 50 మీటర్ల కాపర్ వైర్‌ను రికవరీ చేసినట్లు సమాచారం. అయితే మిగిలిన చోరీలకు పాల్పడిన వారు ఎవరనే విషయం అధికారికంగా తేలాల్సి ఉంది.
కంచె చేను మేసిన చందంగా..?
గనుల భద్రత కోసం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీలు జరుగుతున్న ప్రాంతాల్లో పహారా, నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ వరుసగా కేబుళ్లు మాయమవుతుండటంతో భద్రతా లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్జీ-3 డివిజన్ పరిధిలో గనుల పర్యవేక్షణ, భద్రత కోసం సుమారు 130 సీసీ కెమెరాలు, 255 మంది సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నట్లు సమాచారం. ఇంతటి భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ విలువైన కాపర్, విద్యుత్ కేబుళ్లు వరుసగా చోరీకి గురికావడం పర్యవేక్షణ తీరుపై విమర్శలకు దారితీస్తోంది.
అయితే సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు ప్రస్తుతం నిర్ధారణ కాలేదు. దీనిపై యాజమాన్యం సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
లక్షలాది రూపాయల విలువైన కేబుళ్లు, కాపర్ వైర్లు మాయమవుతున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చోరీలకు లోపాయికారీగా సహకరిస్తున్న వారెవరైనా ఉంటే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
అదేవిధంగా గనుల్లోని విలువైన యంత్రాలు, విద్యుత్ కేబుళ్లు, కాపర్ సామగ్రికి మరింత పటిష్టమైన భద్రత కల్పించాలని సూచిస్తున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజీని సమగ్రంగా పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బంది కదలికలపై కూడా దర్యాప్తు చేయాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయి.
వరుస చోరీలకు అసలు కారణం ఏమిటి? బయట వ్యక్తుల పనేనా.. లేక లోపలి వారి సహకారం ఉందా? అన్న ప్రశ్నలకు సింగరేణి యాజమాన్యం చేపట్టే విచారణతోనే సమాధానం లభించనుంది.

Post a Comment