-->

బిచ్చగత్తె కన్నుమూత.. 30కి పైగా గోనె సంచుల్లో రూ.8.40 లక్షల నగదు

 

బిచ్చగత్తె కన్నుమూత.. 30కి పైగా గోనె సంచుల్లో రూ.8.40 లక్షల నగదు

బిచ్చగత్తె కన్నుమూత.. 30కి పైగా గోనె సంచుల్లో రూ.8.40 లక్షల నగదు

మాండ్య, ఆగస్టు 24: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వెలుగుచూసిన ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జీవితాంతం భిక్షాటన చేస్తూ పేదరికంలో జీవించిన 68 ఏళ్ల వృద్ధురాలు.. తాను కూడబెట్టిన లక్షల రూపాయలను అనుభవించకుండానే కన్నుమూసింది.

మాండ్యకు చెందిన హూర్ అనే వృద్ధురాలు కొంతకాలంగా వయోభారంతో వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆమె తన సోదరితో కలిసి ఓ అద్దె ఇంట్లో నివసించేది. ఇద్దరికీ వివాహం కాలేదు. అయితే రెండేళ్ల క్రితమే హూర్ సోదరి కూడా మృతి చెందింది.

హూర్ మరణించిన అనంతరం స్థానికులు ఆమె నివసించిన ఇంటిని పరిశీలించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇంట్లో 30కి పైగా గోనె సంచుల్లో వేలాది నాణేలు, రూ.10, రూ.20, రూ.50 నోట్లను దాచినట్లు గుర్తించారు. వాటిని లెక్కించగా మొత్తం రూ.8.40 లక్షల నగదు ఉన్నట్లు తేలింది.

భిక్షాటన ద్వారా రూపాయి రూపాయి కూడబెట్టిన హూర్.. ఈ మొత్తాన్ని జీవితాంతం పొదుపు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తాను కూడబెట్టిన సొమ్మును అనుభవించకుండానే ఆమె మృతి చెందడం స్థానికులను కలచివేసింది.

హూర్‌కు సోదరులు ఉండటంతో ఆమె వద్ద లభించిన నగదును వారికి అప్పగించారు. ఒక సోదరుడు తన వాటాగా రూ.6 లక్షలు తీసుకోగా.. మరో సోదరుడు తనకు వచ్చిన రూ.2.40 లక్షలను స్థానిక మసీదుకు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.

పేదరికంలో జీవిస్తూ కష్టపడి కూడబెట్టిన సొమ్ము చివరకు ఆమెకు ఉపయోగపడకపోవడం ఈ ఘటనలో విషాదకరమైన అంశంగా మారింది. ప్రస్తుతం హూర్ ఇంట్లో లభించిన నగదు, ఆమె జీవిత కథకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793