సత్తుపల్లిలో ఘోరం.. వ్యభిచార గృహం వద్ద వివాదం – గ్రామ పెద్దలపై కత్తితో దాడి
సత్తుపల్లిలో ఘోరం.. వ్యభిచార గృహం వద్ద వివాదం – గ్రామ పెద్దలపై కత్తితో దాడి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వ్యభిచార గృహం నిర్వహణపై గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జరిగిన వివాదం కత్తిపోట్లకు దారి తీసి ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది.
బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు మండలానికి చెందిన నాగమణి, హనుమంతరావు దంపతులు ఓ ఇంటిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు స్థానికులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లి గ్రామ సమీపంలో ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడం సరైంది కాదని, వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారడంతో నాగమణి, హనుమంతరావు దంపతులు కొబ్బరి బొండాలు నరికేందుకు ఉపయోగించే కత్తితో గ్రామ పెద్దలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఘటన అనంతరం వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగమణి, హనుమంతరావు దంపతులు పరారైనట్లు తెలుస్తోంది. అయితే కొత్తగూడెంకు చెందిన సోని అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై వియం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, గ్రామ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Post a Comment