-->

వికలాంగ బాలికపై అత్యాచారం కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మైనర్, మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష


కొత్తగూడెం, లీగల్ ప్రతినిధి: మైనర్‌, మానసిక వికలాంగ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. పాక్సో ప్రత్యేక సెషన్స్ జడ్జి ఎస్. సరిత ఈ తీర్పును ప్రకటించారు.

ఘటన వివరాలు

బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇడ్డీ రంగా 2019 మార్చి 19న బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన తమ్ముడు, మరదలు మరణించడంతో వారి మైనర్ కుమార్తె, కుమారుడిని తాను సంరక్షిస్తున్నానని తెలిపారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న మైనర్ బాలిక అదే రోజు ఇంటి నుంచి నగదు, బంగారం, సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయిందని పేర్కొన్నారు. బంధువులకు సమాచారం ఇచ్చినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో బాలిక మూడు వారాల గర్భవతిగా ఉన్నట్టు తేలింది. కోర్టు అనుమతితో 2019 జూన్ 11న గర్భస్రావం నిర్వహించారు.

దర్యాప్తు & చార్జ్‌షీట్

దర్యాప్తు సందర్భంగా సారపాక గాంధీనగర్‌కు చెందిన నూనావత్ నవీన్ ఈ దారుణానికి పాల్పడినట్టు నిర్ధారించారు. అనంతరం డీఎస్పీ చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. కేసులో 13 మంది సాక్షులను విచారించారు.

కోర్టు తీర్పు

వాదోపవాదాలు విన్న అనంతరం నిందితుడిపై నేరం రుజువైనట్టు కోర్టు తేల్చింది.

  • పాక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం: 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా
  • భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376(ఏ) ప్రకారం: 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా

మొత్తం రూ.10,000 జరిమానా విధించగా, చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ అధికారి డి. రాఘవయ్య, లైజన్ అధికారి వీరభద్రం, కోర్టు డ్యూటీ అధికారి పి.సి.ఎండి అక్రమ్ తదితరులు సహకరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793