హృదయ విదారక ఘటన ఇంటర్ ఎగ్జామ్ రోజునే తండ్రి మృతి.. విధి రాసిన అగ్ని పరీక్ష
ఏపీలోని Nellore districtలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. పేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన రోజు.. అదే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రోజు.. కానీ ఆ రోజే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన విషాదం జరిగింది.
సంగం మండల కేంద్రానికి చెందిన కందల శివకుమార్ ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశాడు. తన కుమారుడు రామ సాయి బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆశలు పెట్టుకున్న తండ్రి.. కొడుకుకు తాను ఎదుర్కొన్న కష్టాలు రాకూడదని కలలు కన్నాడు. టెన్త్ పూర్తి చేసిన రామ సాయి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షల తొలి రోజునే ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగా, మరోవైపు పరీక్ష రాయాల్సిన పరిస్థితి రావడంతో రామ సాయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పరీక్షకు వెళ్లాలా? లేక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనాలా? అన్న దుస్థితిలో పడిపోయాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విద్యార్థికి ధైర్యం చెబుతూ పరీక్ష రాయాలని ప్రోత్సహించినట్లు సమాచారం. కానీ తండ్రి మృతదేహం ముందే పరీక్షకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ విద్యార్థి మనసును కలచివేసింది. “ఇలాంటి అగ్ని పరీక్ష మరెవరికీ రాకూడదు” అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక వైపు తండ్రి మృతి, మరోవైపు భవిష్యత్తు కోసం కీలకమైన పరీక్ష – విధి రాసిన ఈ అగ్ని పరీక్ష ఆ విద్యార్థి జీవితంలో మరచిపోలేని సంఘటనగా మిగిలిపోయింది.

Post a Comment