-->

కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం


భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 54వ డివిజన్ అభ్యర్థి పద్మ ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పద్మ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, మొత్తం పోలైన వెయ్యి ఓట్లలో మొదటి రౌండ్‌లో 418 ఓట్ల లెక్కింపులో 100 ఓట్ల కట్టను సిబ్బంది వెంకట్ నాయక్ లెక్కించకుండా తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై తాను పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆమె పేర్కొన్నారు. పైగా తనతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు నిరాకరించారని ఆమె ఆరోపించారు. అధికారపార్టీతో కలిసి తనకు అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసిన పద్మ, రీకౌంటింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సహాయం కోరారు.

పద్మ ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు, ఆమె ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793