ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్! ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఉద్యోగం ఊడినట్లే!
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో మరింత జోరందుకోనుండగా, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం నిషేధమని తెలిపింది.
అంతేకాదు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతుగా పోస్టులు పెట్టినా, షేర్ చేసినా అది కోడ్ ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ప్రచార కార్యక్రమాల్లో తీసిన ఫోటోల్లో ఒక్క ఫోటో బయటపడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం, నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్, ఉద్యోగం నుంచి తొలగింపు వంటి చర్యలకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల కోడ్‌ను గౌరవించాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment