ఫోన్ ట్యాపింగ్ నీచానికి పాల్పడినవారికి శిక్ష తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల వ్యక్తిగత సంభాషణలు కూడా వినే స్థాయికి దిగజారితే, అలాంటి ఘటనలపై విచారణ జరగాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పు చేసినవారే మాపైనే అభియోగాలు మోపుతున్నారని విమర్శించారు.
కక్ష సాధింపు ఆలోచన లేదన్న మంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరి మీదా కక్ష సాధింపు ఆలోచన లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రానికి తీవ్రంగా చెడ్డపేరు తెచ్చిందన్నారు. సాధారణంగా ఉగ్రవాదులు, అడ్డుగోలు కార్యకలాపాలకు పాల్పడేవారి ఫోన్లను ట్యాప్ చేస్తారని, కానీ ఈ ఘటనలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. పక్కా ఆధారాలు లభించిన నేపథ్యంలోనే విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
బాధ్యత మా ప్రభుత్వానిదే
ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాలను తేల్చాల్సిన పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. బీజేపీ నేతలు బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ కూడా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. ఈ నీచానికి ఎవరు ఒడిగట్టారో తేల్చేందుకు లోతైన విచారణ జరుగుతోందని, దుశ్చర్యకు పాల్పడినవారికి కఠిన శిక్ష తప్పదని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు.

Post a Comment