కొత్తగూడెంలో విషాదం.. మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు ఎస్కేమసూద్ కన్నుమూత
భద్రాద్రి కొత్తగూడెం పట్టణానికి చెందిన మాజీ టీడీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ 22వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ ఎస్‌కే మసూద్ (మసూద్ భాయ్) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తిగా మసూద్ భాయ్‌కు మంచి గుర్తింపు ఉంది. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సహాయం చేసే గుణం ఆయన సొంతం. ప్రజలతో కలిసిమెలిసి ఉండే ఆయన నిరాడంబర స్వభావం, చిరునవ్వు, సేవాభావం అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసాయి.
మసూద్ భాయ్ మరణంతో కొత్తగూడెం పట్టణం ఒక మంచి నాయకుడిని, సమాజం ఒక సేవాతత్పరుడిని కోల్పోయిందని ఆయనను సన్నిహితంగా తెలిసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "మీరు మాకు ఒక అన్న, స్నేహితుడు, మార్గదర్శి. మీరు లేకపోవడం తీరని లోటు. మీ మంచితనం, మీ సహాయం చేసే గుణం, మీ ఆప్యాయత ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోతాయి. మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి" అంటూ పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు.
అల్లా ఆయనకు జన్నత్‌లో అత్యున్నత స్థానం ప్రసాదించాలని, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, ఓర్పును కుటుంబ సభ్యులకు ఇవ్వాలని షేక్ అబ్దుల్ సలాం, అబ్దుల్ ముజ్జు, ఇబ్రహీం, మహమ్మద్ అన్వర్, మహమ్మద్ యాకుబ్, మహమ్మద్ అజీమ్, నాగమణి, శ్రీకాంత్, ప్రసాద్, గంగాధర్ తదితరులు దువా చేశారు.
మసూద్ భాయ్ మృతికి పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Post a Comment