సత్తుపల్లిలో నకిలీ పోలీసుల డెకాయిటీ ముఠా అరెస్ట్.
సత్తుపల్లిలో నకిలీ పోలీసుల డెకాయిటీ ముఠా అరెస్ట్.. ఇద్దరు టీజీఎస్పీ సిబ్బంది సహా 12 మంది అదుపులో
ఖమ్మం జిల్లా, జూలై 2: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం పరిధిలో సంచలనం సృష్టించిన డెకాయిటీ కేసును పోలీసులు ఛేదించారు. అమాయకులను బ్లాక్ మనీ పేరుతో మోసం చేసి, నకిలీ పోలీసుల వేషంలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. ఈ ముఠాలో ఇద్దరు టీజీఎస్పీ 15వ బెటాలియన్ సిబ్బంది ఉండటం తీవ్ర సంచలనంగా మారింది.
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కురా గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారంతో గంగారం ప్రాంతంలో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులమని పరిచయం చేసుకుని, బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని, రూ.10 వేలిస్తే రూ.40 వేలుగా మార్చి ఇస్తామని బాధితులను నమ్మించేవారు. అనంతరం భారీ మొత్తంలో నగదుతో రప్పించి, ముందుగానే సిద్ధంగా ఉంచిన నకిలీ పోలీసులతో దాడి చేయించి, వారి వద్ద ఉన్న నగదును దోచుకునేవారు.
ఈ ముఠాలో టీజీఎస్పీ 15వ బెటాలియన్ కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్, ఆర్‌ఎస్‌ఐ బేరా కేశవరావు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
నిందితుల వద్ద నుంచి రూ.17.60 లక్షల నగదు, రెండు ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, రెండు పోలీస్ యూనిఫాంలు, ఒక హ్యాండ్‌కఫ్, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ యూనిఫాంలు, పోలీస్ రైన్‌కోట్లు, పోలీస్ పేరుతో ఉన్న టీ-షర్టులు, అలాగే రూ.500 విలువైన చిన్నారుల డమ్మీ కరెన్సీ నోట్ల 80 బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

Post a Comment