పని ఇప్పిస్తానని నమ్మించి బావిలోకి తోసేశాడు.. 24 గంటలు ప్రాణాలతో పోరాడిన మహిళ
పని ఇప్పిస్తానని నమ్మించి బావిలోకి తోసేశాడు.. 24 గంటలు ప్రాణాలతో పోరాడిన మహిళ
కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్: పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ మహిళపై దుండగుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుని వ్యవసాయ బావిలోకి తోసివేసి పరారయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఓ వ్యక్తి పని ఇప్పిస్తానని చెప్పి ఆమెను నుస్తులాపూర్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఓ వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని బావిలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే లక్ష్మికి ఈత రావడంతో బావిలో మునిగిపోకుండా ప్రాణాలు కాపాడుకుంది. దాదాపు 24 గంటల పాటు బావిలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలతో పోరాడింది.
గురువారం ఉదయం బావి యజమాని అక్కడికి వచ్చి బావిలో మహిళ ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహాయంతో మంచం, తాళ్ల సాయంతో లక్ష్మిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియరాలేదని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తిమ్మాపూర్ ఎస్ఐ సయ్యద్ అన్వర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment