భద్రాచలం గోదావరిలోకి దూకిన మహిళ .. జాలర్ల సాహసంతో ప్రాణాపాయం తప్పింది
భద్రాచలం గోదావరిలోకి దూకిన మహిళ .. జాలర్ల సాహసంతో ప్రాణాపాయం తప్పింది
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బుధవారం ఓ మహిళ గోదావరి వంతెనపై నుంచి నదిలోకి దూకిన ఘటన కలకలం రేపింది. అదే సమయంలో గోదావరిలో చేపలు పడుతున్న జాలర్లు అప్రమత్తంగా స్పందించి వెంటనే నీటిలోకి వెళ్లి ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం ఒడ్డుకు తీసుకువచ్చి చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో ఆమెను విచారించిన పోలీసులు, వైద్య సిబ్బందికి మహిళ తన వివరాల గురించి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆమె గుర్తింపును నిర్ధారించలేకపోయారు. ఆమె మతిస్థిమితం కోల్పోయిందా, లేక మద్యం మత్తులో ఉందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, ఘటనకు ముందు మహిళ కొంతసేపు వంతెనపై తచ్చాడుతూ కనిపించిందని, ఆమె దూకకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ ఒక్కసారిగా గోదావరిలోకి దూకినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనను సమీపంలో ఉన్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment