ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు.. ఎన్నికైన సంఘంతోనే విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం
హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణకు వేగం పెంచుతోంది. ఈ క్రమంలో కూకట్‌పల్లి డిపోకు కేటాయించిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన సంఘంతోనే విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నగరం భవిష్యత్తులో వాయు కాలుష్యంతో మరో ఢిల్లీలా మారకూడదనే లక్ష్యంతోనే పెద్ద ఎత్తున పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1050 ఈ-బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
2027 నాటికి నగరంలో వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 3 వేల ఈ-బస్సులను ప్రవేశపెడితే సుమారు 600 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందన్నారు. త్వరలో మరో 2200 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఇప్పటికే 310 కోట్ల టికెట్లను వినియోగించుకున్నారని మంత్రి తెలిపారు. అలాగే కూకట్‌పల్లి ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కేపీహెచ్‌బీలో కొత్త బస్సు డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ.. ఈ-బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు, బస్టాండ్‌లలో అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని ఈ బస్సులు అందిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మను చౌదరి తదితరులు నూతన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించారు.

Post a Comment