మహిళను హత్య చేసి నగలు దోచుకెళ్లిన దుండగులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి మైసమ్మ (45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దుండగులు మహిళ గొంతు కోయడంతో పాటు రెండు కాళ్లను కూడా తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారం, కాళ్లకు ధరించిన సుమారు 50 తులాల వెండి పట్టీలు దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
మృతురాలు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, మరుసటి రోజు చేవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుకు సమీపంలోని ఓ గార్డెన్ దారిలో ఆమె మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
భర్త మరణంతో మైసమ్మ తన తల్లి ఇంటి వద్దే నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఆమె కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
హత్య జరిగిన ప్రాంతం సమీపంలో మద్యం సీసాలు, వాటర్ బాటిళ్లు, మిక్సర్ ప్యాకెట్లు, మిర్చి బజ్జీలు లభించడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతురాలు కొంతమందితో కలిసి తరచూ కల్లు తాగేదని, హత్య జరిగిన రోజూ కూడా కొందరితో కలిసి ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అలాగే రెండు నెలల క్రితం నమోదైన ఫోన్ దొంగతనం కేసు కోణాన్ని కూడా విచారిస్తున్నారు.
ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరిచయస్తుల ప్రమేయం ఉందా..? లేక ఇతర ముఠాల హస్తం ఉందా..? అనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment