-->

తెలంగాణ అవతరణ దినోత్సవం చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీల విడుదల

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీల విడుదల

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చర్లపల్లి జైలు నుంచి 91 మంది ఖైదీల విడుదల

హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన ఆధారంగా 91 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 85 మంది పురుష ఖైదీలు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. ఖైదీల పునరావాసం, సమాజంలో తిరిగి గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో 2024లో కూడా సత్ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని 213 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 2న జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా విడుదల ఉత్తర్వులు జారీ చేయగా, అర్హత సాధించిన ఖైదీలు జైలు జీవితం నుంచి విముక్తి పొందారు.

ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 91 మంది ఖైదీలను విడుదల చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వ హయాంలో సత్ప్రవర్తన ఆధారంగా ఖైదీల విడుదల ఇది రెండోసారి అని పేర్కొన్నారు. గతంలో సుమారు 230 మంది ఖైదీలను ఇదే విధంగా విడుదల చేసినట్లు చెప్పారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంవత్సరానికి మూడుసార్లు ఖైదీలను విడుదల చేసే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. విడుదలైన ఖైదీల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కొందరికి కుట్టు మిషన్లు పంపిణీ చేయగా, మరికొందరికి ఇతర ఉపాధి మార్గాలు చూపిస్తున్నామని వెల్లడించారు.

విడుదలైన ఖైదీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారని, మళ్లీ నేరాలకు పాల్పడకుండా సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని ఆమె ఆకాంక్షించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిరిగే పరిస్థితులు మళ్లీ రాకుండా చూసుకోవాలని సూచించారు. ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రయాణ, ఇతర సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు.

సమాజంలో సత్ప్రవర్తనతో జీవిస్తూ, తమ జీవితాలను సక్రమ మార్గంలో నడిపితేనే ప్రభుత్వంతో పాటు జైళ్ల శాఖ చేసిన కృషికి నిజమైన ఫలితం దక్కుతుందని సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలు తిరిగి తప్పుదోవ పట్టకుండా సమాజంలో ఆదర్శప్రాయంగా జీవించాలని ఆమె ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793