బయ్యారంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
బయ్యారంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి
బయ్యారం, జూన్ 2: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని సంతులాల్ పోడు తండా సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఇల్లందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కంటైనర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న గోనినేని బాబురావు (62) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై ప్రశాంత్ బాబు ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంతో ముల్కనూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment