మారనున్న భారత కరెన్సీ నోట్లు..? త్వరలో ప్లాస్టిక్ నోట్లు..! ఫైనల్ డెసిషన్‌పై చర్చలు
భారతదేశంలో త్వరలో కరెన్సీ నోట్ల రూపు మారనున్నదా..? ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా..? అనే చర్చలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మేరకు Reserve Bank of India స్థాయిలో కీలక చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణకు భారీ వ్యయం అవుతోంది. నోట్ల మన్నిక కూడా తక్కువగా ఉండటంతో తరచుగా పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్లాస్టిక్ నోట్లతో ప్రయోజనాలే..!
పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. చినగిపోవడం, తడవడం, త్వరగా పాడైపోవడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే నకిలీ నోట్లను అరికట్టడంలో కూడా ఇవి కొంతవరకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉండే అవకాశముండటంతో ఆర్బీఐ ఈ దిశగా ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ రూపంలో కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే బోర్డు సమావేశాల్లో చర్చలు
పాట్నా, ముంబైలో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్ల అంశంపై చర్చ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఏటీఎంల ద్వారా ఈ నోట్లను సులభంగా జారీ చేయవచ్చని, ఇందుకు పెద్ద మార్పులు అవసరం ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
2012లోనూ వచ్చిన ప్రతిపాదనే..
ఇది కొత్త ఆలోచన కాదు. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐదు నగరాల్లో రూ.10 విలువైన పాలిమర్ నోట్ల ఫీల్డ్ ట్రయల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.
అప్పట్లో ప్రభుత్వం ప్రధాన లక్ష్యం నకిలీ నోట్ల నియంత్రణ కంటే నోట్ల మన్నిక పెంచడమేనని తెలిపింది. ఇప్పుడు మళ్లీ అదే ప్రతిపాదనపై చర్చలు ప్రారంభమవడంతో త్వరలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారీగా పెరుగుతున్న ఖర్చులు
గత ఆర్థిక సంవత్సరంలో కాగితపు కరెన్సీ నోట్ల ముద్రణకు సుమారు రూ.6,372.8 కోట్ల వ్యయం జరిగినట్లు సమాచారం. అలాగే సుమారు 23.8 బిలియన్ పాడైపోయిన నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. వీటిలో ఎక్కువగా రూ.500 నోట్లు ఉండగా, తర్వాతి స్థానంలో రూ.100 నోట్లు ఉన్నాయి.
డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం మాత్రం ఇంకా అధికంగానే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మన్నికైన పాలిమర్ నోట్లపై ఆర్బీఐ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Post a Comment