-->

కోదాడలో భారీ కార్డన్ అండ్ సెర్చ్.. 25 బైకులు, కారు స్వాధీనం

 

కోదాడలో భారీ కార్డన్ అండ్ సెర్చ్.. 25 బైకులు, కారు స్వాధీనం

కోదాడలో భారీ కార్డన్ అండ్ సెర్చ్.. 25 బైకులు, కారు స్వాధీనం

కోదాడ, జులై 26: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పోలీసులు ఆదివారం భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు బాలాజీ నగర్ ప్రాంతంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 మోటార్ సైకిళ్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో కోదాడ సబ్‌డివిజన్ పరిధిలోని ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలతో పాటు సుమారు 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడమే ఇటువంటి తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని వృథా చేసుకోకుండా ఆర్థిక క్రమశిక్షణతో జీవించాలని సూచించారు.

ఇళ్ల యజమానులు కొత్త వ్యక్తులకు లేదా సరైన గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని ఆయన హెచ్చరించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతా నియమాలను అనుసరించాలని కోరారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన డీఎస్పీ, ప్రజలు గొడవలకు దూరంగా ఉండి చట్టాన్ని గౌరవించాలని సూచించారు. పట్టణంలో ఎక్కడైనా అక్రమ రవాణా లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, డయల్ 112 లేదా సైబర్ నేరాల కోసం 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793