కేంద్రంలో భారీ ప్రక్షాళన.. అర్ధరాత్రి ఉత్తర్వులు
కేంద్రంలో భారీ ప్రక్షాళన.. అర్ధరాత్రి ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో లోపాలు, పేపర్ లీకేజీల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ (ACC) అర్ధరాత్రి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పలు కీలక శాఖల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, కొత్త నియామకాలు చేపట్టింది.
ఈ మార్పుల్లో భాగంగా కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ను కొత్త ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమించారు. వినీత్ జోషిని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న వివేక్ భరద్వాజ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
అదే విధంగా కేంద్ర పాఠశాల విద్య శాఖ నూతన కార్యదర్శిగా టి.కే. అనిల్ కుమార్ను నియమించారు. పశుసంవర్ధక, డెయిరీ శాఖలో ప్రత్యేక అధికారిగా సుశీల్ కుమార్ లోహాని నియమితులయ్యారు.
గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న పీయూష్ గోయెల్ను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సెక్రటరీ జనరల్‌గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో కేశవ్ చంద్ర గనుల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా చంద్ర భూషణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించనుండగా, ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA) నూతన డైరెక్టర్‌గా బీ. రాజేంద్ర నియమితులయ్యారు.
అలాగే గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సతేంద్ర సింగ్, డీ. థారాలకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) నూతన కార్యదర్శిగా కటికితల శ్రీనివాస్ను నియమించారు.
క్యాబినెట్ సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సుచింద్ర మిశ్రాను జాతీయ మైనారిటీ కమిషన్ కార్యదర్శిగా నియమించగా, జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, నీతి ఆయోగ్ సలహాదారు రాజీవ్ సింగ్ ఠాకూర్తో పాటు పలువురు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇన్-సిటు అప్‌గ్రేడేషన్ కల్పించింది.
ఇదిలా ఉండగా, పరీక్షల అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ ఈ పరిపాలనా మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక రాజకీయ కారణాలను వెల్లడించలేదు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిని మార్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

Post a Comment