సచివాలయంలో ఉరివేసుకుని ఏఎన్‌ఎం ఆత్మహత్య.. నెల్లూరు జిల్లాలో విషాదం
సచివాలయంలో ఉరివేసుకుని ఏఎన్‌ఎం ఆత్మహత్య.. నెల్లూరు జిల్లాలో విషాదం
నెల్లూరు జిల్లా, చిల్లకూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం సాయి చందనప్రియ (27) గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన శ్రీపతి రమణయ్య కుమార్తె సాయి చందనప్రియ ఏడాది క్రితం తొణుకుమాల గ్రామ సచివాలయానికి ఏఎన్‌ఎంగా బదిలీపై వచ్చింది. అప్పటి నుంచి స్థానిక సిబ్బంది, చింతవరం వైద్య సిబ్బందితో కలిసి సచివాలయంలోనే విధులు నిర్వహిస్తూ ఉండేది.
గురువారం మధ్యాహ్నం తాను తర్వాత భోజనం చేస్తానని ఆశా వర్కర్లకు చెప్పి వారిని గ్రామంలోని పాఠశాలకు పంపించింది. అదే సమయంలో సచివాలయ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లగా, అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా పక్క గ్రామానికి వెళ్లడంతో సచివాలయంలో ఆమె ఒక్కరే ఉన్నారు.
ఈ సమయంలో ఆమె ఓ సూసైడ్ నోట్ రాసి టేబుల్‌పై ఉంచి, సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత సచివాలయానికి వచ్చిన సిబ్బంది ఆమెను గమనించి వెంటనే కిందికి దించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.
సూసైడ్ నోట్‌లో "అమ్మా.. నన్ను క్షమించు. మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా. ఎందుకో కూడా సరైన కారణం చెప్పలేను. నా చావుకు ఎవరూ కారణం కాదు" అని రాసినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ బాబు తెలిపారు.
మీకు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లయితే, నమ్మకమైన కుటుంబ సభ్యుడు, స్నేహితుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుడితో వెంటనే మాట్లాడాలని ప్రోత్సహించండి. సమయానికి సహాయం తీసుకోవడం ఎంతో కీలకం.

Post a Comment