ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి, భార్యా పిల్లలకు గాయాలు
ఖమ్మం, మే 30: ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని రామానుజవరం గ్రామ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న రేకు బారికేడును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది.
ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న స్వర్ణకంటి జస్వంత్ (36), అలియాస్ అశోక్, అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌కు చెందినవారు కాగా, ప్రస్తుతం బొల్లారం పోలీస్ స్టేషన్‌లో 2021 బ్యాచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రమాదంలో జస్వంత్ భార్య జ్యోతి కిరణ్ మౌనికకు కాలు విరగగా, కుమార్తె మాన్య (6) కాలుకు గాయాలయ్యాయి. కుమారుడు కళ్యాణ్ రామ్ (4) ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
కుటుంబ సభ్యులు అన్నవరం దేవస్థానం దర్శించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన భార్య, పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్ జస్వంత్ మృతితో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Post a Comment