-->

ఆభరణాల కోసం మహిళ దారుణ హత్య.. కాళ్లు నరికి బంగారం, వెండి దోపిడీ

ఆభరణాల కోసం మహిళ దారుణ హత్య.. కాళ్లు నరికి బంగారం, వెండి దోపిడీ

చేవెళ్ల మండలంలోని ఈర్లపల్లి సమీపంలో ఆభరణాల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించడంతో, కొడుకు సురేశ్‌తో కలిసి ధర్మసాగర్‌లో నివసించేది. అనంతరం కొడుకుకు వివాహం కావడంతో వేర్వేరుగా ఉంటూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైసమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది మైసమ్మదేనని నిర్ధారించారు. దుండగులు ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం ఆమె కాళ్లను నరికి, వాటికి ఉన్న సుమారు 50 తులాల బంగారు కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ భూపాల్‌ శ్రీధర్ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793