-->

150 ఎకరాల మామిడి తోట నష్టం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

150 ఎకరాల మామిడి తోట నష్టం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

వనపర్తి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖిల్లా ఘనపురం మండలం పరిధిలోని సల్కాలాపూర్ గ్రామం లో మామిడి తోట నష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మే 27, బుధవారం వెలుగులోకి వచ్చింది.

స్థానికుల వివరాల ప్రకారం.. డోకూరు గ్రామం కు చెందిన నర్సింహ తన భార్య పుష్పలత, 15 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల కుమారుడితో కలిసి సల్కాలాపూర్ గ్రామంలో 150 ఎకరాల మామిడి తోటను గుత్తకు తీసుకుని సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది.

ఈ ఏడాది మామిడి దిగుబడి బాగుంటుందని ఆశించిన నర్సింహకు అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరుస వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టుబడులు తిరిగి రావడం కష్టమైంది. పెద్ద మొత్తంలో అప్పులు చేసి తోటను గుత్తకు తీసుకున్న నర్సింహ అప్పులు తీర్చలేని పరిస్థితిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఫైనాన్సర్ల ఒత్తిడి కూడా పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న నర్సింహ.. ముందుగా కుమార్తె, కుమారుడిని హత్య చేసి నీటి తొట్టిలో పడేశాడని సమాచారం. అనంతరం భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.

చనిపోవడానికి ముందు నర్సింహ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పుల బాధతో కుటుంబం మొత్తం మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793