-->

అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి.. గడ్డిమందు సేవించి మృతి

అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి.. గడ్డిమందు సేవించి మృతి

గంగాధర : అదనపు కట్నం వేధింపులు ఓ వివాహిత ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాల్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమారంపేట్ గ్రామానికి చెందిన నలువాల ఓదయ్య కుమార్తె నాగరపు లాస్య అలియాస్ నలువాల మమత (32)కు, గోపాల్రావుపల్లికి చెందిన నాగరపు అనిల్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రారంభంలో వీరి దాంపత్య జీవితం సజావుగా సాగినా, గత కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తింటి కుటుంబ సభ్యులు మమతను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు సమాచారం.

ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మమత ఈ నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు (గ్రామక్సోన్) సేవించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ కుమార్తె మరణానికి భర్త అనిల్‌తో పాటు అత్తింటి వారే కారణమని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి నలువాల ఓదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు భర్త, మామ, అత్త, ఆడబిడ్డలపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపారు. ఈ ఘటనతో గోపాల్రావుపల్లి, సోమారంపేట్ గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793