-->

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
 ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శంషాబాద్, జూలై 7: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దగోల్కొండ శివారులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా రామచంద్రాపురం మండలం యెరుపల్లి గ్రామానికి చెందిన చల్లా రాఘవేంద్ర ప్రసాద్ ప్రస్తుతం కిస్మత్‌పూర్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని బంధువైన చల్లా మనోహర్ (25) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

రాఘవేంద్ర ప్రసాద్ సోదరి నిశ్చితార్థం కోసం ఈ నెల 4న రాఘవేంద్ర ప్రసాద్, అతని భార్య భవాని (31), కుమారుడు కార్తికేయ (2), అలాగే మనోహర్ కలిసి స్వగ్రామం యెరుపల్లికి వెళ్లారు. శుభకార్యాలు ముగిసిన అనంతరం ఈ నెల 5న సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు.

సోమవారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్దగోల్కొండ సమీపానికి చేరుకోగానే వారి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో రాఘవేంద్ర ప్రసాద్ సమయానికి గమనించలేకపోయాడు. దీంతో కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదంలో కారు ఎడమవైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ముందు సీట్లో కూర్చున్న మనోహర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక సీట్లో కూర్చున్న భవానికి తీవ్ర గాయాలవడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న చిన్నారి కార్తికేయకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793