మాట్లాడుకుందామంటూ పిలిచి కత్తులతో దాడి.. పాత గొడవలతో యువకుడి దారుణ హత్య
మాట్లాడుకుందామంటూ పిలిచి కత్తులతో దాడి.. పాత గొడవలతో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య నెలకొన్న పాత మనస్పర్థలు చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకున్నాయి. మాట్లాడుకుందామంటూ పిలిపించి, ముందుగానే పథకం ప్రకారం కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్‌లోని సలాల ప్రాంతానికి చెందిన ఫహద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బాల్కషర్ (29) జిమ్ కోచ్‌గా పనిచేస్తూ, మెకానిక్‌గా కూడా ఉపాధి పొందుతున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన సయీద్ బిన్ ఫైసల్ బామ్, సాలం బామ్‌లతో స్నేహం ఉంది. అయితే కొంతకాలంగా వీరి మధ్య వ్యక్తిగత విభేదాలు, మనస్పర్థలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో "మాట్లాడుకుందాం" అంటూ ఫహద్‌ను మరియం కాలనీకి స్నేహితులు పిలిపించారు. అక్కడకు వెళ్లిన అనంతరం వారి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇదే అదనుగా భావించిన నిందితులు ముందుగానే తమ వెంట తీసుకొచ్చిన కత్తులతో ఫహద్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, పలుమార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడి ఉన్న ఫహద్‌ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఫహద్‌ను అత్యవసర చికిత్స కోసం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో బార్కాస్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Post a Comment