మహబూబాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచన
మహబూబాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం.. రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచన
మహబూబాబాద్, జూలై 12: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా గూడూరు, ఖానాపురం అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోందన్న సమాచారం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది.
గూడూరు మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించిన పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అవి ప్రాథమికంగా చిరుతపులికి చెందినవేనని తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ రావు ఈ విషయాన్ని ధృవీకరించారు.
స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం, మండల కేంద్ర సమీపంలోని కోడి చెరువు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఓ రైతు తన పొలానికి వెళ్లగా, సమీపంలో దట్టంగా పెరిగిన జీలుగు మొక్కల మధ్య ఏదో జంతువు కదులుతున్నట్లు గమనించాడు. దీంతో భయాందోళనకు గురైన రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆదివారం ఉదయం మరికొందరు రైతులతో కలిసి అదే ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా జంతువు పాదముద్రలు కనిపించాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. ప్రాథమికంగా అవి చిరుతపులికి చెందినవేనని నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది. అవసరం లేకుండా ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించింది. చిరుత కనిపించినా లేదా అనుమానాస్పద జంతు కదలికలు గమనించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరింది. అటవీశాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, చిరుత సంచారాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Post a Comment