భార్య వెళ్లిపోయిందనే మనస్తాపం.. ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి, తండ్రి ఆత్మహత్య
భార్య వెళ్లిపోయిందనే మనస్తాపం.. ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి, తండ్రి ఆత్మహత్య
తమిళనాడు: భార్య ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్నారులను కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై సమీపంలోని సవేరియార్ పురంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. సవేరియార్ పురానికి చెందిన మరియా మైఖెల్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య సబితా రోనికాతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుమారు ఆరు నెలల క్రితం ఆమె భర్త, పిల్లలను విడిచిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
భార్య దూరమైన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన మైఖెల్ తీవ్ర నిరాశలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిద్రలో ఉన్న తన 14 ఏళ్ల కుమార్తె నిరోష, 12 ఏళ్ల కుమారుడు కెనిస్టన్‌కు విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తాను కూడా విద్యుత్ షాక్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment