రూ.2 కోట్ల డ్వాక్రా సొమ్ము మాయం.. గ్రామదీపిక పరారీ, ఖమ్మంలో కలకలం
రూ.2 కోట్ల డ్వాక్రా సొమ్ము మాయం.. గ్రామదీపిక పరారీ, ఖమ్మంలో కలకలం
ఖమ్మం, జూలై 8: ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల పేర్లపై తీసుకున్న సుమారు రూ.2 కోట్ల రుణాలను గ్రామదీపిక కాజేసి కుటుంబంతో కలిసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారులు రుణాల వసూళ్ల కోసం సభ్యుల ఇళ్లకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది.
బాధిత మహిళల కథనం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం గ్రామదీపిక జయ పది మంది మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేసి, బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు సేకరించింది. అనంతరం సభ్యుల పేర్లపై ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేయించి, ఆ మొత్తాన్ని తమ ఖాతాల నుంచి డ్రా చేయించి "మరుసటి రోజు సమావేశంలో తిరిగి ఇస్తాను" అంటూ తీసుకుంది. అయితే ఆ తర్వాత డబ్బు తిరిగి ఇవ్వకుండా రోజులు గడిపి చివరకు కుటుంబంతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయిందని మహిళలు ఆరోపిస్తున్నారు.
ఇదే తరహాలో పలు స్వయం సహాయక సంఘాల సభ్యుల పేర్లపై రుణాలు తీసుకుని సుమారు రూ.2 కోట్లకు పైగా సొమ్ము దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బ్యాంకర్లపై కూడా అనుమానాలు
రుణాలు మంజూరైన తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు బ్యాంకు అధికారులు వసూళ్ల కోసం రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గ్రామదీపికతో కుమ్మక్కయ్యారనే అనుమానాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకోని రుణాన్ని ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే జైలు శిక్ష అనుభవించిన గ్రామదీపిక
గతంలో మరో మహిళ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నమోదైన కేసులో కోర్టు గ్రామదీపికకు జైలు శిక్ష విధించినట్లు బాధితులు తెలిపారు. శిక్ష పూర్తయ్యాక ఆమె కుటుంబంతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయిందని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తెలియడం లేదని చెప్పారు.
బాధితుల ఆవేదన
బాధితురాలు ఎర్రబోయిన పద్మ మాట్లాడుతూ, తమకు తెలియని సభ్యులతో ఫేక్ గ్రూపు ఏర్పాటు చేసి రూ.10 లక్షల రుణం మంజూరు చేశారని, తనకు మాత్రం రూ.30 వేలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు బ్యాంకు అధికారులు లక్ష రూపాయల రుణం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.
మరో బాధితురాలు మాట్లాడుతూ, తాము అసలు ఎలాంటి రుణం తీసుకోలేదని, అయినప్పటికీ బ్యాంకు అధికారులు రూ.2 లక్షల రుణం చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, తమపై ఉన్న రుణభారాన్ని తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Post a Comment