తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు?.. జగిత్యాలలో కలకలం
తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి క్షుద్రపూజలు?.. జగిత్యాలలో కలకలం
జగిత్యాల జిల్లా, జూలై 9: ప్రజలను మూఢనమ్మకాల బారిన పడకుండా చైతన్యవంతం చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయంలోనే క్షుద్రపూజలు జరిగాయన్న ప్రచారం జగిత్యాల జిల్లా రాయికల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయికల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం ప్రకారం, ఇటీవల కాలంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, జీపీవోలు తరచూ వాహన ప్రమాదాలకు గురవుతుండటంతో కార్యాలయానికి కీడు సోకిందనే నమ్మకంతో కొందరు ఈ పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీపై వచ్చిన జీపీవోలు వరుసగా ప్రమాదాలకు గురవడం అధికారుల్లో ఆందోళన కలిగించిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కార్యాలయం ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారని, విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు కార్యాలయంలోని సీసీ కెమెరాలను నిలిపివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే బుధవారం ఉదయం కార్యాలయ ఆవరణలోని ఒక పిల్లర్ సమీపంలో గుంత తవ్విన ఆనవాళ్లు, గొర్రె బలి ఇచ్చినట్లు కనిపించిన గుర్తులు స్థానికుల దృష్టికి రావడంతో విషయం బయటపడింది. దీంతో పట్టణంలో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
అలాగే పూజలు ముగిసిన అనంతరం మల్లాపూర్ మండలం వీవీరావుపేట సమీపంలోని గంగ వద్ద విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై తహసీల్దార్ నాగార్జునను వివరణ కోరగా, "క్షుద్రపూజల విషయం నా దృష్టికి రాలేదు" అని తెలిపారు. తహసీల్దార్‌కు తెలియకుండానే ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదా దర్యాప్తు వివరాలు వెలువడలేదు. ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

Post a Comment