-->

448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు.. తహసీల్దార్ సస్పెన్షన్

 

448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు.. తహసీల్దార్ సస్పెన్షన్

448 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు.. తహసీల్దార్ సస్పెన్షన్

గజ్వేల్‌, జూలై 8: రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అక్రమాలపై కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు (సిట్) విచారణలో మరో కీలక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో ఏకంగా 448 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లకు పట్టా మార్చినట్లు విచారణలో తేలడంతో రెవెన్యూ శాఖలో కలకలం రేగింది.

సిట్ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, అప్పటి తహసీల్దార్ దండు సుజాత భూముల యాజమాన్య మార్పిడికి సంబంధించిన దరఖాస్తులను సరైన ధ్రువీకరణ లేకుండానే ఆమోదించినట్లు గుర్తించారు. కనీసం క్రాస్‌చెక్ చేయకుండా, అవసరమైన ఆధార పత్రాలు లేకుండానే పట్టామార్పిడి ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి తహసీల్దార్ దండు సుజాతను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో భాగంగా దాదాపు 50 అసైన్డ్ భూముల మ్యుటేషన్ ఫైళ్లను, అలాగే 10 వారసత్వ మార్పిడి ఫైళ్లను ఆమె ఆమోదించినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని సమాచారం. విచారణలో ఆరోపణలు పూర్తిగా రుజువైతే సంబంధిత అధికారులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి దర్యాప్తు అనంతరం ఈ భూకుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

ఇక తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తహసీల్దార్ దండు సుజాత హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793