25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి.. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా మహ్మద్ ఇస్మాయిల్
25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి.. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా మహ్మద్ ఇస్మాయిల్
జగిత్యాల, ధర్మపురి: నేటి కాలంలో చిన్న మొత్తాల అప్పులను కూడా తిరిగి చెల్లించకుండా తప్పించుకునే ఘటనలు పెరుగుతున్న తరుణంలో, 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును మరచిపోకుండా తీర్చేందుకు కేరళ నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురికి వచ్చిన ఓ వ్యక్తి నిజాయితీ, కృతజ్ఞత, స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు.
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, ధర్మపురికి చెందిన ఎడ్ల లచ్చన్నతో కలిసి సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఆ సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం ఇస్మాయిల్, లచ్చన్న వద్ద నుంచి కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ అప్పు తీర్చేస్తానని ఆయన మాట ఇచ్చారు.
అయితే అనివార్య కారణాలతో స్వదేశానికి వచ్చిన అనంతరం ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో అప్పు చెల్లించే అవకాశం దొరకలేదు. అయినప్పటికీ, తీసుకున్న రుణాన్ని ఇస్మాయిల్ ఎప్పుడూ మరచిపోలేదు. ఇటీవల ఎలాగైనా ఆ అప్పు తీర్చాలని నిర్ణయించుకున్న ఆయన, లచ్చన్న చిరునామా లేదా ఫోన్ నంబర్ లేకపోయినా, "ధర్మపురి" అనే ఒక్క సమాచారం ఆధారంగా గూగుల్‌లో వెతికి జగిత్యాల జిల్లాకు చేరుకున్నారు.
స్థానికులను అడుగుతూ గురువారం లచ్చన్న ఇంటిని గుర్తించిన ఇస్మాయిల్, ఆ సమయంలో లచ్చన్న గల్ఫ్ దేశంలో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం లచ్చన్నకు ఫోన్ చేయగా, అప్పు ఇచ్చిన విషయాన్ని మరిచిపోయిన లచ్చన్న తన పాత మిత్రుడి గొంతు వినగానే గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
ఆ తర్వాత మహ్మద్ ఇస్మాయిల్ రూ.25 వేల నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేసి, ఇన్నేళ్లుగా తన మనసులో ఉన్న రుణభారం తీరిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. స్నేహితుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా వచ్చి అప్పు తీర్చడం పట్ల లచ్చన్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ఘటన గురించి తెలిసిన ధర్మపురి ప్రజలు మహ్మద్ ఇస్మాయిల్‌ను నిజాయితీ, కృతజ్ఞత, స్నేహానికి ప్రతీకగా కొనియాడుతున్నారు. కాలం మారినా మాట నిలబెట్టుకోవడం, తీసుకున్న రుణాన్ని మరచిపోకుండా తిరిగి చెల్లించడం వంటి విలువలు ఇంకా సమాజంలో ఉన్నాయని ఈ సంఘటన మరోసారి చాటి చెప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ధర్మపురిలో చర్చనీయాంశంగా మారింది.

Post a Comment