చెన్నూరులో గురుకుల విద్యార్థి అదృశ్యం.. తల్లిదండ్రుల్లో ఆందోళన.. పోలీసులు గాలింపు
చెన్నూరులో గురుకుల విద్యార్థి అదృశ్యం.. తల్లిదండ్రుల్లో ఆందోళన.. పోలీసులు గాలింపు
మంచిర్యాల జిల్లా, జూలై 3: మంచిర్యాల జిల్లాలో ఓ గురుకుల విద్యార్థి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
చెన్నూరు మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్గం హరికిషన్, మమత దంపతుల కుమారుడు హర్ష గత మూడు సంవత్సరాలుగా గురుకుల పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే గురువారం మధ్యాహ్నం తర్వాత హర్ష కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అతని కోసం పాఠశాల ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.
రాత్రి సుమారు 9 గంటల వరకు వెతికినా విద్యార్థి ఆచూకీ లభించకపోవడంతో పాఠశాల యాజమాన్యం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పాఠశాలకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుమారుడి కోసం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
విద్యార్థి అదృశ్యం కావడానికి గల కారణాలు ఏమిటి? అతను ఎక్కడికి వెళ్లాడు? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment