రూ.2 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో
లంచం కేసులో డీఎంహెచ్‌ఓ, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తి అరెస్ట్
రూ.2 లక్షలు డిమాండ్.. రూ.లక్ష లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన డ్రైవర్
హైదరాబాద్, అక్టోబర్ 5: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) కార్యాలయానికి చెందిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చర్యలు చేపట్టారు. లంచం డిమాండ్ చేసి స్వీకరించిన వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన ప్రైవేట్ డ్రైవర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్న స్వర్ణకుమారి (AO-1), అదే కార్యాలయంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాస్ (AO-2) సూచనల మేరకు వారి వద్ద ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మద్దూరికృష్ణయ్య (A-3) ఫిర్యాదుదారుడి నుంచి రూ.2 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు.
ఫిర్యాదుదారుడికి చెందిన ఫిజియోథెరపీ కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేయడంతో, కేంద్రానికి సంబంధించిన తాళాలను తిరిగి అప్పగించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అలాగే డీఎంహెచ్‌ఓ లైసెన్స్ లేకుండా కేంద్రం నిర్వహిస్తున్నందుకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు, కొత్త డీఎంహెచ్‌ఓ లైసెన్స్ జారీ చేసేందుకు కూడా లంచం కోరినట్లు పేర్కొంది.
డిమాండ్ చేసిన రూ.2 లక్షల్లో భాగంగా రూ.1 లక్ష లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు మద్దూరికృష్ణయ్యను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.1 లక్ష లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో AO-1, AO-2లు తమ అధికారిక విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
కేసుకు సంబంధించి AO-1 స్వర్ణకుమారి, AO-2 ఎం. శ్రీనివాస్, A-3 మద్దూరికృష్ణయ్యను నాంపల్లిలోని SPE & ACB కేసుల I అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. తెలంగాణ ఏసీబీని వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్‌లో Telangana ACB, ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో @Telangana ACB ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
ప్రజల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదుదారు లేదా బాధితుడి పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

Post a Comment