-->

సింగరేణి లాభాల్లో 36 శాతం కార్మికులకు చెల్లించాలి టీబీజీకేఎస్

 

2025-26 వార్షిక లాభాలను తక్షణమే వెల్లడించాలి: టీబీజీకేఎస్

సింగరేణి లాభాల్లో 36 శాతం కార్మికులకు చెల్లించాలి టీబీజీకేఎస్

2025-26 వార్షిక లాభాలను తక్షణమే వెల్లడించాలి: టీబీజీకేఎస్

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల కష్టంతో సాధించిన బొగ్గు విక్రయాల ద్వారా సంస్థకు వచ్చిన నికర లాభాలను తక్షణమే వెల్లడించాలని, అందులో కార్మికులకు రావాల్సిన 36 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు.

సోమవారం కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గనులు, వివిధ డిపార్ట్‌మెంట్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్తం చిందిస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని, వారి కష్టానికి తగిన గుర్తింపు, హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వార్షిక లాభాలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే ప్రకటించాలని ఆయన కోరారు. కార్మికులకు రావాల్సిన 36 శాతం లాభాల వాటాను ఆలస్యం చేయకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి వాస్తవ లాభాల ఆధారంగా కార్మికులకు లాభాల వాటా చెల్లించిన వివరాలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల వాటా విషయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రకటించిన లాభాల వాటాలో కూడా గతంతో పోలిస్తే సగం మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు.

గత రెండేళ్లలో కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు విక్రయాల ద్వారా వచ్చిన నిధుల్లో సుమారు రూ.6,300 కోట్లను సంస్థ అభివృద్ధి కోసం పక్కన పెట్టినట్లు చెబుతున్నారని, అయితే ఆ నిధుల వినియోగం, వివరాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని కాపు కృష్ణ పేర్కొన్నారు. వాటిపై ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం

సింగరేణిలో కార్మికుల భద్రత విషయంలోనూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. మెడికల్ బోర్డులు నిర్వహించకపోవడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

గనుల్లో కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు అందుబాటులో లేవని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు, పని ప్రదేశాల భద్రతకు అవసరమైన రూఫ్ బోల్ట్ సామగ్రి కూడా గనుల్లో కొరతగా ఉందన్నారు.

అలాగే బొగ్గు ఉత్పత్తికి అవసరమైన షవల్స్, డంపర్లు, డోజర్లు తదితర భారీ యంత్రాలను కొత్తగా కొనుగోలు చేయకపోవడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకవైపు బొగ్గు ఉత్పత్తి తగ్గుతుండగా, మరోవైపు కార్మికుల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన

సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా చెల్లింపు తేదీని తక్షణమే ప్రకటించాలని కాపు కృష్ణ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే సింగరేణి కార్పొరేట్ కార్యాలయంతో పాటు ప్రజాభవన్‌ను ముట్టడించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.

కార్మిక సంఘాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకుని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంఘటితంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం కొత్తగూడెం ఏరియా పరిధిలోని గని మేనేజర్లు, వివిధ డిపార్ట్‌మెంట్ హెడ్‌లకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, కాగితపు విజయ్ కుమార్, బూర్గుల రవికుమార్, బోరింగ్ శంకర్, ఎంటెక్ మహేందర్, నమల్ల వెంకటేశ్వర్లు, గోల్కొండ నవీన్, అలీమ్, అజీజ్, దేవ్ సింగ్, వెంకట్రావు, సంతోష్, రాజ్ కుమార్, తిరుపతి, పాషా, నిశాంత్, ప్రవీణ్, శివ, సందీప్, రాజేష్, అనుదీప్, బాలాజీ, గడప రాజేష్, రంజిత్, నవీన్, కృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.