-->

ఘోర రైలు ప్రమాదం.. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని 300 గొర్రెలు మృతి

 

ఘోర రైలు ప్రమాదం.. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని 300 గొర్రెలు మృతి

 ఘోర రైలు ప్రమాదం.. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని 300 గొర్రెలు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్‌ 29: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు సమీపంలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాజీపేట నుంచి నాంపల్లి వైపు వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలపైకి వచ్చిన గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమారు 300 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఒకేసారి భారీ సంఖ్యలో మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడంతో ఘటనాస్థలంలో విషాద వాతావరణం నెలకొంది.

కుక్కల దాడితో పట్టాలపైకి..

గొర్రెల కాపరుల కథనం ప్రకారం.. రైల్వే ట్రాక్‌ సమీపంలో రాత్రివేళ సేదతీరుతున్న గొర్రెల మందపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో భయభ్రాంతులకు గురైన గొర్రెలు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తూ రైల్వే పట్టాలపైకి చేరుకున్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వాటిని ఢీకొట్టడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

ఈ ప్రమాదంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ కళ్ల ముందే భారీ సంఖ్యలో గొర్రెలు మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రూ.50 లక్షల వరకు నష్టం

ప్రమాదంలో నష్టపోయిన గొర్రెల కాపరులు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జూలూరు అలీనగర్‌ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. సుమారు రూ.50 లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.

ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత గొర్రెల కాపరులను పరామర్శించారు. తమకు జరిగిన భారీ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన పరిహారం అందించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.

మూగజీవాల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని గొర్రెల పెంపకందారులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.