మాటామాటా పెరిగి దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి హత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలు ఓ ఇల్లాలి ప్రాణాలను బలిగొన్నాయి. భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన భర్త.. భార్య తలపై రోకలిబండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందులకు చెందిన నరేందర్ తన కుటుంబంతో కలిసి సుమారు నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లికి వచ్చి నివాసం ఉంటున్నాడు. నరేందర్‌కు భార్య తేజస్వి (28), ఐదేళ్ల కుమారుడు లోహిత్ ఉన్నారు. నరేందర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ బార్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా నరేందర్, తేజస్వి మధ్య కుటుంబ విషయాలకు సంబంధించి తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటామాటా పెరగడంతో నరేందర్ తీవ్ర ఆగ్రహానికి గురై తేజస్వి తలపై రోకలిబండతో బలంగా కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య మృతి చెందిన అనంతరం నరేందర్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Post a Comment