షార్ట్‌సర్క్యూట్‌తో రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం
వికారాబాద్‌లో విషాద ఘటన.. షార్ట్‌సర్క్యూట్‌తో రూ.20 లక్షల నగదు, బంగారం దగ్ధం
వికారాబాద్ జిల్లా: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా గుడిసెలో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇంట్లో దాచిన రూ.20 లక్షల నగదు, ఐదు తులాల బంగారం, వెండి ఆభరణాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బండివాడ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
బండివాడ గ్రామానికి చెందిన అంజప్ప మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తాము నివసిస్తున్న పాత ఇంటిని కూల్చివేసి, నూతన గృహ నిర్మాణ పనులను ప్రారంభించాడు. ఇల్లు నిర్మాణంలో ఉండటంతో ప్రస్తుతం పక్కనే చిన్న గుడిసె వేసుకుని భార్య అనిత, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నారు.
ఇల్లు నిర్మాణానికి అవసరమైన డబ్బు కోసం మేడ్చల్ జిల్లా బొల్లారంలోని తమ ప్లాటును విక్రయించినట్లు తెలుస్తోంది. ప్లాటు విక్రయం ద్వారా వచ్చిన రూ.20 లక్షల నగదును శుక్రవారం ఇంటికి తీసుకొచ్చి గుడిసెలోని బీరువాలో భద్రపరిచారు. అలాగే బంగారు, వెండి ఆభరణాలను కూడా అదే బీరువాలో ఉంచారు.
శనివారం ఉదయం అంజప్ప పనిమీద బయటకు వెళ్లగా, ఆయన కుమారుడు పాఠశాలకు వెళ్లాడు. అంజప్ప భార్య అనిత కూడా బయట పనిలో ఉండగా గుడిసెలోని ఫ్రిజ్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో అనిత అక్కడికి చేరుకుని చూడగా గుడిసెలో మంటలు వ్యాపించి ఉన్నాయి.
విషయం గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మంటలు బీరువాకు అంటుకోవడంతో అందులో ఉన్న రూ.20 లక్షల నగదు, ఐదు తులాల బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా దగ్ధమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది.
జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఇల్లు నిర్మించుకోవాలన్న ఆశతో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అంజప్ప కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒక్కసారిగా భారీ మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణుకుమార్ తెలిపారు.

Post a Comment