స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కవిత వ్యూహరచన
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కవిత వ్యూహరచన
పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు.. క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్న కవిత
గ్రేటర్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా–మండల పరిషత్ ఎన్నికలపై ఫోకస్
హైదరాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలాన్ని చాటేలా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు.
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన కవిత.. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం
నిజామాబాద్, కొడంగల్‌లో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభల’కు ప్రజల నుంచి వచ్చిన స్పందనపై కవిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు పార్టీ నుంచి ఎలాంటి పాత్రను ఆశిస్తున్నారు? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే అంశాలపై నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు.
ప్రజలకు ఎక్కడ సమస్య ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు తక్షణమే స్పందించి వారికి అండగా నిలవాలని కవిత సూచించారు.
రిమ్స్ ఘటనపై ప్రస్తావన
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా ఐదుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన అనంతరం తెలంగాణ రక్షణ సేన స్పందించిన తీరును కవిత ప్రస్తావించారు. రిమ్స్ ఆస్పత్రిలో సమస్యలపై పార్టీ తరఫున స్పందించిన అనంతరం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు.
ఏళ్లుగా రిమ్స్ ఆస్పత్రిని పట్టించుకోలేదని, తక్షణ చర్యల కోసం ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసిందని ఆమె తెలిపారు. కలెక్టర్ రిమ్స్ ఆస్పత్రి సమస్యలపై సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి నివేదిక అందించారని పేర్కొన్నారు. తాను ఆస్పత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచిన అనంతరం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిందని కవిత గుర్తు చేశారు.
గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట సహా ఇతర మున్సిపాలిటీల్లో పార్టీ పోటీకి సిద్ధం కావాలని నేతలకు కవిత సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలు బుధవారం వరకు కొనసాగనున్నాయి. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల నేతలతో, బుధవారం ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో కవిత సమావేశం కానున్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Post a Comment