సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: కల్వకుంట్ల కవిత (వీడియో)
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: కల్వకుంట్ల కవిత (వీడియో)
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షులు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర బొగ్గు ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా ఉందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు.
కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు, వేతనాలు, సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, వైద్య సదుపాయాలు, డిపెండేంటి హక్కులకు సంబంధించిన అంశాలపై యాజమాన్యం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారం చూపే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
మొక్కుబడిగా మెడికల్ బోర్డు నిర్వహిస్తాం అంటే ఊరుకునేది లేదు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి సింగరేణి కార్మికుడిని అన్ ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాల్సిందే, సింగరేణి యాజమాన్యం దిగి వచ్చి చర్చలు జరిపింది కాబట్టి వారికి రెండు నెలల సమయం ఇస్తున్నాం, ఇప్పటి నుంచి మెడికల్ బోర్డులో అన్ ఫిట్ 80 శాతానికి చేరాలి. లేదంటే సింగరేణి భవన్ గేటు ముందే ఆమరణ దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
సింగరేణి కార్మికుల శ్రమతో సంస్థ లాభాలు ఆర్జిస్తోందని, ఆ లాభాల్లో కార్మికులకు తగిన వాటా దక్కేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే చర్చలకు ముందుకు రావాలని కల్వకుంట్ల కవిత కోరారు.
సింగరేణి భవన్ ముట్టడి సందర్భంగా హెచ్‌ఎంఎస్ నాయకులు, కార్మికులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు.

Post a Comment