-->

సింహాచలంలో ఘోర అపశృతి... వర్షానికి రిటైనింగ్ వాల్ కూలి 8 మంది మృతి

సింహాచలంలో ఘోర అపశృతి... వర్షానికి రిటైనింగ్ వాల్ కూలి 8 మంది మృతి


విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతజనశక్తి న్యూస్ (AP & TG) వెల్లడించిన సమాచారం ప్రకారం, సింహాచల అప్పన్న స్వామి వారి వార్షిక చందనోత్సవాలు జరుగుతున్న సమయంలో అకాల వర్షం కారణంగా ఆలయం సమీపంలో ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోయింది.

ఈ ప్రమాదంలో తొలుత ఆరుగురు భక్తులు శిథిలాల కింద చిక్కిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. అటు తర్వాత శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ టీం మరింత మందిని బయటకు తీశారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదిగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఇంకా నలుగురు భక్తుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే NDRF బృందాలు, ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసు అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉండే అవకాశం ఉందని భావిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ హఠాత్ ఘటన సింహాచల దేవస్థానానికి వచ్చిన భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని ఖాళీ చేయించి, భద్రత చర్యలు చేపట్టారు. ఇక, వర్షానికి కారణమైన భద్రతా లోపాలపై దేవస్థాన ట్రస్టు, మున్సిపల్ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలో కూడ విచారణ జరుగనుంది.


Blogger ఆధారితం.