తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా గర్వకారణమైన గుర్తింపు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అన్ని రేవంత్ రెడ్డి యావత్ పోలీసు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా కలిగిన 18 రాష్ట్రాల మధ్య నిర్వహించిన police performance మదింపు ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ ఘనత రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవంగా పేర్కొంటూ, ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం, కేసుల నమోదు విషయంలో పారదర్శకత పాటించడం వంటి అంశాల్లో తెలంగాణ పోలీసులు అత్యుత్తమంగా పని చేశారు. దీని వల్ల రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబడేలా వారు ముఖ్యపాత్ర పోషించారు" అని తెలిపారు.
అలాగే, రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసు శాఖ ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించిందని, ప్రజా పాలనలో ఇది ఒక మైలురాయి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇది పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారని, ప్రజల సేవలో అంకితభావంతో కొనసాగాలని ముఖ్యమంత్రి సందేశం ఇచ్చారు.
Post a Comment